Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Friday, August 16, 2013

మార్కు1వఅధ్యాయము

1  దేవుని కుమారుడైన యేసుక్రీస్తు1సువార్త ప్రారంభము. 
2  - ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను; అతడు నీ మార్గము సిద్ధపరచును. 
3  ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయుచున్న ఒకని శబ్దము. అని ప్రవక్తయైన యెషయాచేత వ్రాయబడినట్టు2. 
4  బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాపక్షమాపణనిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచు వచ్చెను. 
5  అంతట యూదైయ దేశస్థులందరును యెరూషలేమువారందరును బయలుదేరి అతనియొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు, యొర్దాను నదిలో అతనిచేత బాప్తిస్మము పొందుచుండిరి. 
6  యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొలచుట్టు తోలుదట్టియు ధరించుకొని. మిడతలను అడవి తేనెను భక్షించువాడు. 
7  మరియు అతడు నాకంటె శక్తిమంతుడొకడు నా వెనుక వచ్చుచున్నాడు; నేను వంగి ఆయన చెప్పులవారును విప్ప పాత్రుడను కాను; 
8  నేను నీళ్లలో3మీకు బాప్తిస్మమిచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మలో4మీకు బాప్తిస్మమిచ్చునని చెప్పి ప్రకటించుచుండెను. 
9  ఆ దినములలో యేసు గలిలైయలోని నజరేతు నుండి వచ్చి యొర్దానులో యోహానుచేత బాప్తిస్మము పొందెను. 
10  వెంటనే ఆయన నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము తెరువబడుటయు పరిశుద్ధాత్మ పావురమువలె తనమీదికి దిగివచ్చుటయు చూచెను. 
11  మరియు -- నీవు నా ప్రియకువారుడవు; నీయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను. 
12  వెంటనే పరశుద్ధాత్మ ఆయనను అరణ్యములోకి వెళ్లునట్లు ప్రేరేపించెను. 
13  ఆయన సాతానుచేత శోధింపబడుచు అరణ్యములో నలుబది దినములు అడవి మృగములతోకూడ నుండెను; మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. 
14  యోహాను చెరసాలలో వేయబడిన తరువాత యేసు 
15  --- కాలము సంపూర్ణమై యున్నది, దేవుని రాజ్యము సమీపించి యున్నది; మారుమనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలైయకు వచ్చెను.  
16  ఆయన గలిలైయ సముద్రతీరమున వెళ్లుచుండగా సీమోనును సీమోను సహోదరుడగు అంద్రెయయు సముద్రములో వలవేయుట చూచెను; ఏలయనగా వారు జాలరులు. 
17  యేసు -- నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టుజాలరులనుగా చేసెదనని వారితో చెప్పెను.  
18  వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. 
19  ఆయన ఇంక కొంతదూరము వెళ్లి జెబెదై కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను; వారు దోనెలో ఉండి తమ వలలు బాగుచేసికొనుచుండిరి. 
20  వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రియైన జెబెదైని జీతగాండ్రయొద్ద దోనెలో విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. 
21  అంతట వారు కపెర్నహూములోకి వెళ్లిరి. వెంటనే ఆయన విశ్రాంతిదినమున సమాజమందిరములోకి పోయి బోధించెను. 
22  ఆయన శాస్త్రులవలె కాక అధికారము గలవానివలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. 
23  ఆ సమయమున వారి సమాజమందిరములో అపవిత్రాత్మపట్టిన మనుష్యుడొకడుండెను. 
24  వాడు -- వద్దు నజరేయుడవగు యేసూ, నీతో మాకేమి? మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియును; నీవు దేవుని పరిశుద్దుడవు అని కేకలు వేసెను. 
25-26. అందుకు యేసు - ఊరకొమ్ము, వాని విడిచిపొమ్మని దాని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వాని విలవిలలాడించి పెద్ద కేకవేసి వాని విడిచిపోయెను. 
27  అందరును విస్మయమొంది - ఇదేమిటో? యిది కొత్త బోధగా ఉన్నదే; యీయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని యొకనితో ఒకడు చెప్పుకొనిరి. 
28  వెంటనే ఆయననుగూర్చిన సమాచారము త్వరలో గలిలైయ ప్రాంతములందంతట వ్యాపించెను. 
29  అటుతరువాత వారు సమాజమందిరములోనుండి వెళ్లి యాకోబుతోను యోహానుతోను సీమోను అంద్రెయ అనువారి యింట ప్రవేశించిరి. 
30  సీమోను అత్త జ్వరముతో పడియుండగా వెంటనే వారామెను గూర్చి ఆయనతో చెప్పిరి. 
31  ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యిపట్టి ఆమెను లేవలెత్తెను; అంతట జ్వరము ఆమెను వదిలెను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను. 
32  సాయంకాలమున ప్రొద్దు గ్రుంకినప్పుడు జనులు సకల రోగులను దయ్యములు పట్టినవారిని ఆయన యొద్దకు తీసికొని వచ్చిరి; 
33  పట్టణమంతయు ఇంటి వాకిట కూడియుండెను. 
34  ఆయన నానావిధ రోగములచేత పీడింపబడిన అనేకులను స్వస్థపరచి అనేకమైన దయ్యములన వెళ్లగొట్టెను. అవి తన్ను ఎరిగియుండినందున ఆయన ఆ దయ్యములను మాటలాడనియ్యలేదు. 
35  ఇంక చాలరాత్రియుండగా ఆయన పెందలకడనే లేచి బయలుదేరి అరణ్యప్రదేశమునకు వెళ్లి అక్కడ ప్రార్థనచేయుచుండెను. 
36  సీమోనును అతనితో కూడ నున్నవారును ఆయనకోసరము వెళ్లి 
37  ఆయనను కనుగొని - అందరు నిన్ను వెదకుచున్నారని ఆయనతో చెప్పగా 
38  ఆయన - నేను ఇతరమైన సమీపగ్రామములలోను ప్రకటించుటకు వెళ్లుదము రండి; యిందు నిమిత్తమే గదా నేను బయలుదేరి వచ్చితినని వారితో చెప్పెను. 
39  ఆయన గలిలైయయందంతట వారి సమాజమందిరములలో ప్రకటించుచు దయ్యములను వెళ్లగొట్టుచునుండెను. 
40  ఒక కుష్ఠరోగి ఆయనయొద్దకు వచ్చి ఆయనయెదుట మోకాళ్లూని - నీ కిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా. 
41  ఆయన కనికరపడి చెయ్యి చాపి వాని ముట్టి - నాకిష్టమే; నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. 
42  వెంటనే కుష్ఠరోగము వాని విడిచెను గనుక వాడు శుద్ధుడాయెను. 
43  అప్పుడాయన - ఎవనితోను ఏమియు చెప్పకుసుమీ; 
44  నీవు వెళ్లి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనుపరచుకొని, నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించుమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వాని పంపివేసెను. 
45  అయితే వాడు వెళ్లి అందునుగూర్చి విస్తారముగా ప్రకటించుటకును, ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను గనుక ఆయన ఇకను పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక వెలపట అరణ్యప్రదేశములలో నుండెను; నలుదిక్కులనుండి జనులు ఆయనయొద్దకు వచ్చుచుండిరి. 
Download Audio File

మార్కు2వఅధ్యాయము

1  కొన్నిదినములైన పిమ్మట ఆయన మరల కపెర్నహూములోకి వచ్చెను. 
2  ఆయన యింట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడివచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా 
3  కొందరు పక్షవాయువుగల ఒక మనుష్యుని నలుగురిచేత మోయించుకొని ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి. 
4  చాలమంది కూడియున్నందున వారాయనయొద్దకు చేరలేక ఆయనయున్నచోటికి పైగా ఇంటికప్పు విప్పి, సందుచేసి పక్షవాయువుగలవానిని పరుపుతోనే దింపిరి. 
5  యేసు వారి విశ్వాసము చూచి - కుమారుడా, నీ పాపములు క్షమింపబడియున్నవని పక్షవాయువుగలవానితో చెప్పెను. 
6  శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండియుండిరి. 
7  వారు - ఇతడిట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణచేయుచున్నాడు గదా; దేవుడొక్కడే తప్ప పాపములు క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. 
8  వారు తమలోతాము ఈలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలిసికొని - మీరీలాటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు?  
9  ఈ పక్షవాయువుగలవానితో - నీ పాపములు క్షమింపబడియున్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరపెత్తుకొని నడువుమని చెప్పుట సులభమా?  
10  అయితే పాపములు క్షమించుటకు భూమిమీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెనని వారితో చెప్పి 
11  పక్షవాయువుగలవానిని చూచి - నీవు లేచి నీ పరుపెత్తుకొని యింటికి పొమ్మని నీతో చెప్పుచున్నాననెను. 
12  తత్క్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరియెదుట నడిచిపోయెను గనుక వారందరు విభ్రాంతినొంది - మనమీలాటికార్యములను ఎన్నడును చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి. 
13  ఆయన సముద్రతీరమున మరల నడచిపోవుచుండెను. జనులందరును ఆయనయొద్దకు రాగా ఆయన వారికి బోధించెను. 
14  ఆయన మార్గమున వెళ్లుచు, సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫయు కుమారుడగు లేవిని చూచి - నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. 
15  అతనియింట ఆయన భోజనమునకు కూర్చుండియుండగా, సుంకరులను పాపులును అనేకులు యేసుతోను ఆయన శిష్యులతోను కూర్చుండియుండిరి. ఇట్టివారనేకులుండిరి. వారాయనను వెంబడించువారైరి. 
16  పరిసయ్యులలోనున్న శాస్త్రులు ఆయన సుంకరులతోను పాపులతోను భుజించుట చూచి - ఆయన సుంకరులతోను పాపులతోను కలిసి భోజనము చేయుచున్నాడేమని ఆయన శిష్యుల నడుగగా 
17  యేసు ఆమాట విని - రోగులకేగాని ఆరోగ్యముగలవారికి వైద్యుడక్కరలేదు; నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను. 
18  యోహోను శిష్యులును పరిసయ్యులును ఉపవాసము చేయుట కద్దు. కాబట్టి వారు వచ్చి - యోహాను శిష్యులును పరిశయ్యుల శిష్యులును ఉపవాసము చేయుదురు; దీనికి హేతువేమని ఆయన నడుగగా 
19  యేసు -పెండ్లికుమారుడు తమతోకూడ ఉన్నకాలమున పెండ్లి ఇంటివారు ఉపవాసము చేయదగునా? పెండ్లికుమారుడు తమతోకూడ ఉన్నంతకాలము ఉపవాసము చేయదగదు గాని 
20  పెండ్లికుమారుడు వారియొద్దనుండి కొనిపోబడు దినములు వచ్చును. ఆ దినములలోనే వారుపవాసము చేతురు.  
21  ఎవడును పాతబట్టకు కొత్తగుడ్డ మాసికను వేయడు; వేసినయెడల ఆ కొత్త మాసిక పాత బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును.  
22  ఎవడును పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసము పోయడు; పోసినయెడల ద్రాక్షారసము ఆ తిత్తులను పిగుల్చును, రసమును తిత్తులును చెడును; అయితే కొత్త ద్రాక్షరసము కొత్త తిత్తులలో పోయవలెనని చెప్పెను. 
23  మరియు ఆయన విశ్రాంతిదినమున పంటచేలలోబడి వెళ్లుచుండగా శిష్యులు మార్గమున సాగిపోవుచు వెన్నులు త్రుంచుచుండిరి. 
24  పరిశయ్యులు - చూడుము, విశ్రాంతిదినమున చేయకూడనిది వారేల చేయుచున్నారని ఆయన నడిగిరి. 
25  అందుకాయన వారితో ఇట్లనెను - తానును తనతోకూడ నున్నవారును ఆకలిగొనినందున దావీదుకు అవసరము వచ్చియున్నప్పుడు అతడు చేసినది మీరెన్నడును చదవలేదా? 
26  అబ్యాతారు ప్రధానయాజకుడై యుండగా దేవమందిరములోకి వెళ్లి, యాజకులే గాని యితరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడ ఉన్నవారికిచ్చెను గదా అని చెప్పెను. 
27  మరియు - విశ్రాంతిదినము మనుష్యులకొరకే నియమింపబడెను గాని మనుష్యులు విశ్రాంతిదనముకొరకు నియమింపబడలేదు.  
28  అందువలన మనుష్యకుమారుడు విశ్రాంతిదినమునకు ప్రభువై యున్నాడని వారితో చెప్పెను. 
Download Audio File

మార్కు3వఅధ్యాయము

1  సమాజమందిరములో ఆయన మరల ప్రవేశింపగా అక్కడ ఊచచెయ్యి గలవాడు ఒకడుండెను. 
2  అచ్చటి వారు ఆయనమీద నేరము మోపవలెననియుండి, విశ్రాంతిదినమున వాని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. 
3  ఆయన - నీవు లేచి మధ్యను నిలువమని ఊచచెయ్యిగలవానితో చెప్పి 
4  వారిని చూచి - విశ్రాంతిదినమున మేలుచేయుట ధర్మమా కీడుచేయుట ధర్మమా? ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా? అని అడిగెను; అందుకు వారు ఊరకుండిరి. 
5  ఆయన వారిహృదయకాఠిన్యమునకు దుఃఖపడి, కోపముతో వారిని కలయచూచి - నీ చెయ్యి చాపుమని ఆ మనుష్యునితో చెప్పెను; వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. 
6  పరిసయ్యులు వెలుపలికిపోయి వెంటనే హేరోదీయులతో కలిసికొని, ఆయననేలాగు సంహరింతుమాయని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. 
7  యేసు తన శిష్యులతోకూడ సముద్రమునొద్దకు వెళ్లగా గలిలైయనుండి వచ్చిన గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను. 
8  మరియు ఆయన ఇంత గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదైనుండియు, యెరూషలేమునుండియు, ఇదూమైయనుండియు, యొర్దాను అవతలనుండియు తూరు సీదోను అనెడి పట్టణప్రాంతములనుండియు ఆయనయొద్దకు గుంపులు గుంపులుగా వచ్చిరి. 
9  జనులు గుంపుకూడగా చూచి, వారు తన్ను ఇరికింపకుండునట్లు చిన్నదోనె యొకటి తనకు సిద్ధపరచి యుంచవలెనని ఆయన తన శిష్యులతో చెప్పెను. 
10  ఆయన అనేకులను స్వస్థపరచెను గనుక రోగపీడితులైనవారందరు ఆయనను ముట్టుకొనవలెనని ఆయనమీద పడుచుండిరి. 
11  అపవిత్రాత్మలు (పట్టినవారు) ఆయనను చూడగానే ఆయన యెదుట సాగిలపడి - నీవు దేవుని కుమారుడవని చెప్పుచు కేకలు వేసిరి. 
12  ఆయన తన్ను ప్రసిద్ధిచేయవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. 
13  తరువాత ఆయన కొండెక్కి తనకిష్టమైనవారిని పిలువగా వారాయనయొద్దకు వచ్చిరి. 
14-15. వారు తనతోకూడ ఉండి, దయ్యములను వెళ్లగొట్టు అధికారముగలవారై (సువార్త) ప్రకటించుటకు వారిని పంపవలెనని ఆయన పన్నెండుమందిని నియమించెను. 
16  వారెవరనగా - ఆయన పేతురను పేరుపెట్టిన సీమోను 
17  జెబెదై కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను; వీరిద్దరికి ఆయన బోయనేర్గెసను పేర్లు పెట్టెను; బోయనేర్గెసు అనగా ఉరిమెడువారని అర్థము. 
18  అంద్రెయ, ఫిలిప్పు, బర్తొలొమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడగు యాకొబు, తద్దయి కనానీయుడైన సీమోను, 
19  ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా అనువారు. 
20  ఆయన ఇంటిలోకి వచ్చినప్పుడు జనులు మరల గుంపుకూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను వారికి వీలులేకపోయెను. 
21  ఆయన ఇంటివారు సంగతి విని, ఆయన మతి చలించియున్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. 
22  యెరూషలేమునుండి వచ్చిన శాస్త్రులు - ఇతడు బయల్జెబూలు పట్టినవాడై దయ్యముల యధిపతిచేత దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని చెప్పిరి. 
23  అప్పుడాయన వారిని తనయొద్దకు పిలిచి ఉపమానరీతిగా వారితో ఇట్లనెను - సాతాను సాతానునేలాగు వెళ్లగొట్టును? 
24  ఒక రాజ్యము తనకుతానే విరోధముగా వేరుపడినయెడల ఆ రాజ్యము నిలువనేరదు. 
25  ఒక యిల్లు తనకుతానే విరోధముగా వేరుపడినయెడల ఆ యిల్లు నిలువనేరదు. 
26  సాతాను తనకుతానే విరోధముగా లేచి వేరుపడినయెడల వాడు నిలువలేక కడతీరును. 
27  ఒకడు మొదట బలవంతుడైన వాని బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంటజొచ్చి వాని సామగ్రి దోచుకొననేరడు; బంధించినయెడల వాని యిల్లు దోచుకొనవచ్చును. 
28  సమస్త పాపములును మనుష్యులు చేయు దూషణలన్నియు వారికి క్షమింపబడును గాని 
29  పరిశుద్ధాత్మ విషయము దూషణచేయువాడెప్పుడును క్షమాపణ పొందక నిత్యపాపము చేసినవాడైయుండుని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాననెను. 
30  ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టినవాడని వారు చెప్పిరి. 
31  తరువాత ఆయన సహోదరులను తల్లియు వచ్చి లోపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయనచుట్టు కూర్చుండిరి. 
32  వారు - ఇదిగో నీ తల్లియు నీ సహోదరులును వెలుపల ఉండి నీకోసరము వెదకుచున్నారని ఆయనతో చెప్పగా 
33  ఆయన - నా తల్లి నా సహోదరులు ఎవరని చెప్పి 
34  తన చుట్టు కూర్చున్నవారిని కలయ చూచి- ఇదిగో నా తల్లియు నా సహోదరులును; 
35  దేవుని చిత్తముచొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియునై యున్నాడని చెప్పెను. 
Download Audio File

మార్కు4వఅధ్యాయము

1  ఆయన సముద్రతీరమున మరల బోధింప నారంభింపగా బహు జనులాయనయొద్దకు కూడి వచ్చియున్నందున ఆయన సముద్రములో ఒక దోనెయెక్కి కూర్చుండెను. జనులందరు సముద్రతీరమున నేలమీద నుండిరి. 
2  ఆయన ఉపమానరీతిగా అనేక సంగతులు వారికి బోధించుచు తన బోధలో వారితో ఇట్లనెను. - 
3  వినుడి విత్తువాడు విత్తుటకు బయలు వెళ్లెను. 
4  వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవప్రక్కను పడెను గనుక పక్షులు వచ్చి వాటిని మ్రింగివేసెను. 
5  కొన్ని చాలా మన్నులేని రాతినేలను పడెను; అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని 
6  సూర్యుడు ఉదయింపగానే అవి మాడి, వేరులేనందున ఎండిపోయెను. 
7  కొన్ని ముండ్లపొదలలో పడెను; ముండ్లపొదలు ఎదిగి వాటిని అణచివేసెను గనుక అవి ఫలింపలేదు. 
8  కొన్ని మంచినేలను పడెను; అవి మొలిచి పెరిగి పైరై ముప్పదంతలుగాను అరువదంతలుగాను నూరంతలుగాను ఫలించెను 
9  వినుటకు చెవులుగలవాడు వినునుగాక అని చెప్పెను. 
10  ఆయన ఒంటిగా ఉన్నప్పుడు పన్నెండుమంది శిష్యులతో కూడ ఆయనుచుట్టు ఉండినవారు ఆ ఉపమానమునుగూర్చి ఆయన నడిగిరి. 
11  అందుకాయన - దేవుని రాజ్యమర్మము (తెలిసికొనుట) మీకు అనుగ్రహింపబడియున్నది గాని 
12  వెలుపటనుండువారు ఒకవేళ దేవునివైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని, వారు చూచుటకైతే చూచియు కనుగొనకను, వినుటకైతే వినియు గ్రహింపకయుండుటకును సమస్తము వారికి ఉపమానరీతిగా బోధింపబడుచున్నదని వారితో చెప్పెను. 
13  మరియు - ఈ ఉపమానము మీకు తెలియలేదా? ఆలాగైతే ఉపమానములన్నియు మీకేలాగు తెలియుననెను. 
14  విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. 
15  త్రోవప్రక్క నుండువారెవరనగా, వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినినవెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యమెత్తికొని పోవును. 
16  అటువలె రాతినేలను విత్తబడినవారెవరనగా, వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు; 
17  అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగగానే వారు అభ్యంతరపడుదురు. 
18-19. ఇతరులు ముండ్లపొదలలో విత్తబడినవారు; వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములును ధనమోసమును మరి ఇతరమైన అపేక్షలును లోపల చొచ్చి వాక్యమును అణిచివేయుటవలన అది నిష్ఫలమగును. 
20  మంచి నేలను విత్తబడినవారెవరనగా, వాక్యము విని దానిని అంగీకరించి ముప్పదంతలుగాను అరువదంతలుగాను నూరంతలుగాను ఫలించువారని చెప్పెను. 
21  మరియు ఆయన వారితో ఇట్లనెను - దీపము దీపస్తంభముమీద నుంచబడుటకే గాని కుంచెముక్రిందనైనను మంచముక్రిందనైన నుంచబడుటకు తేబడదుగదా. 
22  రహస్య మేదైనను తేటపరచబడకపోదు; బయలుపరచబడుటకే గాని యేదియు మరుగుచేయబడలేదు. 
23  వినుటకు చెవులెవనికైన యుండినయెడల వాడు వినునుగాకనెను. 
24  మరియు ఆయన - మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుతురో అట్టి కొలతతోనే మీకు కొలువబడును, మరి ఎక్కువగా మీకియ్యబడును. 
25  కలిగినవానికి ఇయ్యబడును, లేనివానికి కలిగినదియు వానియొద్దనుండి తీసివేయబడునని వారితో చెప్పెను. 
26-27. మరియు ఆయన - ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి, దివారాత్రులు నిద్రపోవుచు మేల్కొనుచునుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యమున్నది. 
28  భూమి మొదట మొలకను తరువాత వెన్నును అటుతరువాత వెన్నులో ముదురు గింజలను తనంతటతానే పుట్టించును. 
29  పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని (సేద్యగాడు ) వెంటనే కొడవలి పెట్టి కోయునని చెప్పెను. 
30  మరియు ఆయన ఇట్లనెను - దేవుని రాజ్యమును ఎట్లు పోల్చెదము? ఏ ఉపమానముతో దానిని ఉపమించెదము?  
31  అది ఆవగింజను పోలియున్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమిమీదనున్న విత్తనములన్నిటికంటె చిన్నదేగాని 
32  విత్తబడిన తరువాత అది మొలిచి యెదిగి కూర మొక్కలన్నిటికంటె పెద్దదై గొప్ప కొమ్మలు వేయును గనుక ఆకాశపక్షులు దాని నీడను నివసింపగలవనెను. 
33  వారికి వినుటకు శక్తి కలిగినకొలది యీలాటి అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యము బోధించెను. 
34  ఉపమానము లేక వారికి బోధింపలేదుగాని ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటిని విశదపరచెను. 
35  35-36. ఆ దినమందే సాయంకాలమైనప్పుడు ఆయన- అద్దరికి పోవుదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి, ఆయనను ఉన్నపాటున చిన్నదోనెలో తీసికొనిపోయిరి; ఆయనవెంబడి మరికొన్ని దోనెలు వచ్చెను. 
36  35-36. ఆ దినమందే సాయంకాలమైనప్పుడు ఆయన- అద్దరికి పోవుదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి, ఆయనను ఉన్నపాటున చిన్నదోనెలో తీసికొనిపోయిరి; ఆయనవెంబడి మరికొన్ని దోనెలు వచ్చెను. 
37  అప్పుడు పెద్ద తుఫాను రేగి అలలు ఆయనయున్న దోనెమీద కొట్టినందున దోనె నిండిపోయెను. 
38  ఆయన దోనె అమరమున తలగడమీద (తలవాల్చుకొని) నిద్రించుచుండెను. వారాయనను లేపి - బోధకుడా, మేము నశించిపోవుచున్నాము; నీకు చింతలేదా? అని ఆయనతో అనిరి. 
39  అందుకాయన లేచి గాలిని గద్దించి - నిశ్శబ్దమై ఊరకొమ్మని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను. 
40  అప్పుడాయన - మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మికలేక యున్నారా? అని వారితో చెప్పెను. 
41  వారు మిక్కిలి భయపడి - ఈయన ఏలాటివాడో; గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని యొకనితో ఒకడు చెప్పుకొనిరి. 
Download Audio File

మార్కు5వఅధ్యాయము

1  తరువాత వారాసముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. 
2  ఆయన దోనె దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడొకడు గోరీలలోనుండి వచ్చి ఆయనకెదురుపడెను. 
3  వాడు గోరీలలో వాసము చేసెడివాడు, సంకెళ్లతోనైనను ఎవడును వాని బంధింపలేకపోయెను. 
4  పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్లు వేసి బంధించినను వాడు ఆ చేతిసంకెళ్లు తెంపి కాలిసంకెళ్లను తుత్తినియులుగా చేసెను గనుక ఎవడును వానిని సాధుపరచ లేకపోయెను. 
5  వాడు ఎల్లప్పుడును దివారాత్రులు గోరీలలోను కొండలలోను కేకలువేయుచు తన్ను తాను రాళ్లతో గాయపరచుకొనుచు నుండెను. 
6  వాడు దూరమునుండి యేసును చూచి పరుగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారముచేసి 
7  - యేసూ, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నీతో నాకేమి? నన్ను బాధపరచకుమని దేవుని పేరట నీకు ఆనపెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. 
8  ఎందుకనగా ఆయన - అపవిత్రాత్మా, యీ మనుష్యుని విడిచిపొమ్మని వానితో చెప్పెను. 
9  మరియు ఆయన - నీ పేరేమని వాని నడుగగా వాడు - నా పేరు సేన, యేలయనగా మేము అనేకులమని చెప్పి 
10  తమ్మును ఆ దేశములోనుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను. 
11  అక్కడ కొండదగ్గర పందుల పెద్దమంద మేయుచుండెను 
12  గనుక - ఆ పందులలో ప్రవేశించునట్లు మమ్మును వాటియొద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను. 
13  యేసు వాటికి సెలవియ్యగా ఆ అపవిత్రాత్మలు వాని విడిచి పందులలో ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు రెండు వేల సంఖ్యగల ఆ మంద ప్రపాతమునుండి సముద్రపుదారిని వడిగా పరుగెత్తుకొనిపోయి సముద్రములో పడి ఊపిరి తిరుగక చచ్చెను. 
14  ఆ పందులు మేపుచున్నవారు పారిపోయి పట్టణములోను గ్రామములోను ఆ సంగతి తెలియజేసిరి. 
15  జనులు జరిగినది చూడ వెళ్లి యేసునొద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించికొని స్వచిత్తుడై కూర్చునియుండుట చూచి భయపడిరి. 
16  జరిగినది చూచినవారు దయ్యములు పట్టినవానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరివారికి తెలియజేయగా 
17  తమ ప్రాంతములు విడిచిపొమ్మని వారాయనను బతిమాలుకొనసాగిరి. 
18  ఆయన దోనె యెక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయనయొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను గాని 
19  ఆయన వానికి సెలవియ్యక - నీవు నీ యింటివారియొద్దకు వెళ్లి, ప్రభువు నీయందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నియు వారికి తెలియజెప్పుమనెను. 
20  వాడు వెళ్లి యేసు తనకు చేసినవన్నియు దెకపొలిలో ప్రకటింప నారంభింపగా అందరు ఆశ్చర్యపడిరి. 
21  యేసు మరల దోనె యెక్కి అద్దరికి వెళ్లినప్పుడు బహు జనసమూహము ఆయనయొద్దకు కూడివచ్చెను. 
22  ఆయన సముద్రతీరమున నుండగా సమాజమందిరపు అధికారులలో యయీరను నొకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదములమీద పడి 
23  నా చిన్న కుమార్తె చావనైయున్నది; అది బాగుపడి బ్రదుకునట్లు నీవు వచ్చి దానిమీద నీ చేతులుంచవలెనని ఆయనను మిగుల బతిమాలుకొనగా 
24  ఆయన అతనితో కూడ వెళ్లెను; బహు జనసమూహము ఆయనను వెంబడించి ఆయనమీద పడుచుండిరి. 
25  పన్నెండేండ్లనుండి రక్తస్రావ రోగము కలిగిన యొక స్త్రీ యుండెను. ఆమె అనేక వైద్యులచేత ఎన్నో తిప్పలుపడి 
26  తనకు కలిగినదంతయు వ్యయముచేసికొని, యెంతమాత్రమును ప్రయోజనములేక మరింత సంకటపడెను. 
27-28. ఆమె యేసునుగూర్చి విని- నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదుననుకొని, జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. 
29  వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణయైనదని గ్రహించుకొనెను. 
30  వెంటనే యేసు తనలోనుండి ప్రభావము బయలువెళ్లెనని తనలోతాను గ్రహించి, జనసమూహము వైపు తిరిగి - నా వస్త్రములు ముట్టినదెవరని అడుగగా 
31  ఆయన శిష్యులు - జనసమూహము నీమీద పడుచుండుట చూచుచున్నావే; నన్ను ముట్టినదెవడని అడుగుచున్నావా? అనిరి. 
32  ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయనచుట్టు చూచెను. 
33  అప్పుడా స్త్రీ తనకు తటస్థించినది యెరిగినదై, భయపడి వణకుచువచ్చి ఆయన ఎదుట సాగిలపడి, తన సంగతియంతయు ఆయనతో చెప్పెను. 
34  అందుకాయన - కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానముగలదానవై పొమ్ము; నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పెను. 
35  ఆయన ఇంక మాటలాడుచుండగా సమాజమందిరపు అధికారి యింటనుండి కొందరు వచ్చి - నీ కుమార్తె చనిపోయినది; నీవికను బోధకుని ఎందుకు శ్రమపెట్టుదువనిరి. 
36  యేసు వారు చెప్పిన మాట లక్ష్యపెట్టక - భయపడకుము, నమ్మికమాత్రముంచుమని సమాజమందిరపు అధికారితో చెప్పి 
37  పేతురు, యాకోబు, యాకోబు సహోదరుడగు యోహాను అనువారిని తప్ప మరి ఎవరినైనను తన వెంబడి రానియ్యక 
38  సమాజమందిరపు అధికారి యింటికి వచ్చి, వారు గొల్లుగానుండి చాల యేడ్చుచు ప్రలాపించుచునుండుట చూచి 
39  లోపలికిపోయి - మీరేల గొల్లుచేసి యేడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదేగాని చనిపోలేదని వారితో చెప్పెను. 
40  అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారినందరిని బయటకు పంపివేసి, ఆ చిన్నదాని తలిదండ్రులను తనతో ఉన్నవారిని వెంటబెట్టుకొని, ఆ చిన్నది పరుండియున్న గదిలోకి వెళ్లి 
41  ఆ చిన్నదాని చెయిపట్టి - తలితాకుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా, లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము 
42  వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను; ఆమె పన్నెండు సంవత్సరముల ప్రాయముగలది. అప్పుడు వారు మహా విస్మయము నొందినవారైరి. 
43  జరిగినది ఎవనికిని తెలియకూడదని ఆయన వారికి గట్టిగానాజ్ఞాపించి, ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పెను. 
Download Audio File

మార్కు6వఅధ్యాయము

1  ఆయన అక్కడనుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. 
2  విశ్రాంతిదినము వచ్చినప్పుడు ఆయన సమాజమందిరములో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి - ఈ సంగతులు ఇతనికి ఎక్కడ నుండి వచ్చెను? ఇతనికియ్యబడిన ఈ జ్ఞానమెట్టిది? ఇతని చేతులవలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి; ఇదేమి? 
3  ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని చెల్లెండ్లు ఇక్కడ మనయొద్దనే యున్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. 
4  అందుకు యేసు - ప్రవక్త తన దేశములోను తన బంధువులలోను తన యింటివారిలోను తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడని చెప్పెను. 
5  అందువలన కొద్దిమంది రోగులమీద చేతులుంచి వారిని స్వస్థపరచుటతప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. 
6  అయన చుట్టుపట్లనున్న గ్రామములు తిరుగుచు బోధించుచుండెను. 
7  ఆయన పన్నెండుగురు శిష్యులను తనయొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు, అపవిత్రాత్మల మీద వారికధికారమిచ్చి 
8  - ప్రయాణముకొరకు చేతికర్రను తప్ప రొట్టెనైనను జాలెనైనను సంచిలో సొమ్మునైనను తీసికొనక 
9  చెప్పులు తొడుగుకొనుడనియు, రెండంగీలు వేసికొనవద్దనియు వారికాజ్ఞాపించెను. 
10  మరియు ఆయన వారితో ఇట్లనెను - మీరెక్కడ ఒక యింట ప్రవేశించెదరో అక్కడనుండి మీరు బయలుదేరువరకు ఆ యింటనే బసచేయుడి. 
11  ఏ స్థలమందైనను జనులు మిమ్మును చేర్చుకొని మీ మాటలు వినకుంటే, మీరు అక్కడనుండి బయలుదేరునప్పుడు వారిమీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింద ధూళి దులిపివేయుడి. 
12  కాగా వారు బయలుదేరి, మారుమనస్సు పొందవలెనని ప్రకటించుచు 
13  దయ్యములు అనేకములు వెళ్లగొట్టుచు రోగులను అనేకులకు నూనె రాచి స్వస్థపరచుచునుండిరి. 
14  ఆయన కీర్తి ప్రసిద్ధమాయెను గనుక రాజైన హేరోదు ఆయననుగూర్చి విని - బాప్తిస్మమిచ్చు యోహాను మృతులలోనుండి లేచియున్నాడు గనుక అతనియందు అద్భుతములు క్రియాసాధకములగుచున్నవని చెప్పెను. 
15  ఇతరులు - ఈయన ఏలీయా అనియు, మరకొందరు - ఈయన ప్రవక్తయనియు, ప్రవక్తలలో ఒకనివలె నున్నాడనియు చెప్పుకొనుచుండిరి. 
16  అయితే హేరోదు విని - ఇతడు నేను తలగొట్టించిన యోహానే; అతడు మృతులలోనుండి లేచియున్నాడని చెప్పెను. 
17  హేరోదు తన సహోదరుడగు ఫిలిప్పు భార్యయైన హేరోదియను పెండ్లిచేసికొనినందున యోహాను - నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయముకాదని హేరోదుతో చెప్పెను గనుక 
18  ఇతడామె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించియుండెను. 
19-20. హేరోదియ అతనిమీద పగ పట్టి అతని చంపింప నుద్దేశించెను గాని ఆమెచేత కాకపోయెను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరశుద్ధుడునగు మనుష్యుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుచు వచ్చెను. మరియు అతని మాటలు వినినప్పుడు ఏమిచేయను తోచకపోయినను సంతోషముతో వినుచుండెను. 21. అయితే సమయోచిత దినమొకటి వచ్చెను; ఎట్లనగా హేరోదు తన జన్మదినోత్సవమందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలైయదేశ ప్రముఖులకును విందు చేయించెను 
21  అయితే సమయోచిత దినమొకటి వచ్చెను; ఎట్లనగా హేరోదు తన జన్మదినోత్సవమందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలైయదేశ ప్రముఖులకును విందు చేయించెను. 
22  అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికివచ్చి నాట్యమాడి హేరోదును అతనితోకూడ పంక్తిని కూర్చున్నవారిని సంతోషపరచెను గనుక రాజు - నీకిష్టమైనది ఏదైనను నన్నడుగుము, నేను నీకిచ్చెదనని ఆ చిన్నదానితో చెప్పెను. 
23  మరియు - నీవు నా రాజ్యములో సగముమట్టుకు ఏమి అడిగినను నీకిచ్చెదనని అతడు ఆమెతో ఒట్టుపెట్టుకొనెను. 
24  గనుక ఆమె వెళ్లి - నేనేమి అడిగెదనని తన తల్లి నడుగగా ఆమె - బాప్తిస్మమిచ్చు యోహాను తల అడుగుమనెను. 
25  వెంటనే ఆమె త్వరగా రాజునొద్దకు వచ్చి - బాప్తిస్మమిచ్చు యోహాను తల పళ్లెములో పెట్టి యిప్పుడే నాకిప్పింప గోరుచున్నానని చెప్పెను. 
26  రాజు బహు దుఃఖపడెను గాని తాను పెట్టుకొనిన ఒట్టు నిమిత్తమును తనతో కూర్చున్నవారి నిమిత్తమును ఆమెకు ఇయ్యను అననొల్లకపోయెను. 
27  వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి యొక బంటును పంపెను. వాడు వెళ్లి చెరసాలలో అతని తల గొట్టి 
28  పళ్లెములో అతని తల పెట్టి తెచ్చి ఆ చిన్నదానికిచ్చెను, ఆ చిన్నది తన తల్లికిచ్చెను. 
29  యోహాను శిష్యులు ఈ సంగతి విని, వచ్చి శవమును ఎత్తికొనిపోయి సమాధిలో ఉంచిరి. 
30  అంతట అపొస్తలులు యేసునొద్దకు కూడివచ్చి తాము చేసినవన్నియు బోధించినవన్నియు ఆయనకు తెలియజేసిరి. 
31  అప్పుడాయన - మీరేకాంతముగా అరణ్యస్థలమునకు వచ్చి కొంచెముసేపు అలసట తీర్చుకొనుడని చెప్పెను; ఏలయనగా అనేకులు వచ్చుచు పోవుచునుండినందున భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయెను. 
32  కాగా వారు దోనెయెక్కి అరణ్యప్రదేశమునకు ఏకాంతముగా వెళ్లిరి. 
33  వారు వెళ్లుచుండగా జనులు చూచి, అనేకులాయనను గుర్తెరిగి, సకల పట్టణములనుండి అక్కడికి కాలినడకను పరుగెత్తి వారికంటె ముందుగా వచ్చిరి. 
34  గనుక యేసు వచ్చి విస్తారమైన ఆ జనసమూహమును చూచి, వారు కాపరిలేని గొర్రెలవలె ఉన్నందున వారిమీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. 
35  చాల ప్రొద్దుపోయిన తరువాత ఆయన శిష్యులాయనయొద్దకు వచ్చి - ఇది అరణ్యప్రదేశము, ఇప్పుడు చాల ప్రొద్దుపోయినది; 
36  చుట్టుపట్ల గ్రామములకు వారు వెళ్లి భోజనమునకేమైనను కొనుక్కొనుటకు వారిని పంపివేయుమని చెప్పిరి. 
37  అందుకాయన - మీరు వారికి భోజనము పెట్టుడనగా వారు - మేము వెళ్లి యిన్నూరు దేనారములరొట్టెలు కొని వారికి పెట్టుదుమా అని ఆయన నడిగిరి. 
38  38-39. అందుకాయన - మీయొద్ద ఎన్ని రొట్టెలున్నవి? పోయి చూడుడని వారితో చెప్పెను. వారు చూచి తెలిసికొని - అయిదు రొట్టెలును రెండు చేపలునున్నవనిరి. అప్పుడాయన - పచ్చికమీద అందరు పంక్తులు పంక్తులుగా కూర్చుండవలెనని వారికాజ్ఞాపింపగా 
39  38-39. అందుకాయన - మీయొద్ద ఎన్ని రొట్టెలున్నవి? పోయి చూడుడని వారితో చెప్పెను. వారు చూచి తెలిసికొని - అయిదు రొట్టెలును రెండు చేపలునున్నవనిరి. అప్పుడాయన - పచ్చికమీద అందరు పంక్తులు పంక్తులుగా కూర్చుండవలెనని వారికాజ్ఞాపింపగా 
40  వారు నూరేసిమంది చొప్పునను ఏబదేసిమందిచొప్పునను పంక్తులు తీరి కూర్చుండిరి. 
41  అంతట ఆయన ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను ఎత్తికొని, ఆకాశమువైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి, ఆ రెండు చేపలను అందరికిని పంచి పెట్టించెను. 
42-43. వారందరు తిని తృప్తిపొందినతరువాత మిగిలిన చేపలును రొట్టె ముక్కలును పన్నెండు గంపెళ్లు ఎత్తిరి. 
44  ఆ రొట్టెలు తినినవారు అయిదువేలమంది పురుషులు. 
45  వెంటనే ఆయన జనసమూహమును పంపివేయునంతలో తన శిష్యులను దోనె ఎక్కి అద్దరినున్న బేత్సయిదాకు ముందుగా వెళ్లుడని ఆయన బలవంతము చేసెను. 
46  ఆయన వారిని వీడుకొలిపి, ప్రార్థనచేయుటకై కొండకు వెళ్లెను. 
47  సాయంకాలమైనప్పుడు ఆ దోనె సముద్రము మధ్య ఉండెను గాని ఆయన ఒంటిగా మెట్టననుండెను. 
48  అప్పుడు గాలి వారికి ఎదురైనందున దోనె నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి, ఇంచుమించు రాత్రి నాలుగవ జామున సముద్రముమీద నడుచుచు వారియొద్దకు వచ్చి వారిని దాటిపోవలెనని యుండెను. 
49  ఆయన సముద్రముమీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలువేసిరి. 
50  అందరు ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి - ధైర్యము తెచ్చుకొనుడి; నేనే, భయపడకుడని చెప్పెను. 
51  తరువాత ఆయన దోనె యెక్కి వారియొద్దకు వచ్చినప్పుడు గాలి అణగెను; అందుకు వారు తమలోతాము మిక్కిలి విభ్రాంతినొందిరి; 
52  అయినను వారి హృదయము కఠినమాయెను గనుక వారు రొట్టెలనుగూర్చిన సంగతి గ్రహింపలేదు. 
53  వారు అవతలకు దాటి గెన్నేసరెతుదగ్గర ఒడ్డుకు వచ్చి దరి పట్టిరి. 
54  వారు దోనె దిగగానే జనులు ఆయనను గురుతుపట్టి 
55  ఆ ప్రదేశమందంతట పరుగెత్తికొనిపోయి, ఆయన యున్నాడని వినినచోటుకు రోగులను మంచములమీద మోసికొని వచ్చుటకు మొదలు పెట్టిరి. 
56  గ్రామములలోను పట్టణములలోను పల్లెటూళ్లలోను ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించెనో అక్కడివారు రోగులను సంతవీధులలో ఉంచి, వారు ఆయన వస్త్రపుచెంగుమాత్రము ముట్టనిమ్మని ఆయను వేడుకొనిరి; ఆయనను ముట్టినవారందరు స్వస్థతనొందిరి. 
Download Audio File

మార్కు7వఅధ్యాయము

1  యెరూషలేమునుండి వచ్చిన పరిసయ్యులును శాస్త్రులలో కొందరును ఆయనయొద్దకు కూడివచ్చి 
2  ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో, అనగా కడుగని చేతులతో భోజనము చేయుట చూచిరి. 
3  పరిసయ్యులును యూదులందరును పెద్దల పారంపర్యాచారమునుబట్టి చేతులు కడుగుకొంటేనే గాని భోజనము చేయరు. 
4  మరియు వారు సంతనుండి వచ్చునప్పుడు స్నానము చేసితేనే గాని భోజనము చేయరు. ఇదియుగాక గిన్నెలను కుండలను ఇత్తడి పాత్రలనునీళ్లలో కడుగుటమొదలగు అనేకాచారములను వారనుసరించుకొనినవారు. 
5  అప్పుడు పరిసయ్యులును శాస్త్రులును - నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారముచొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయననడిగిరి. 
6  అందుకాయన వారితో ఈలాగు చెప్పెను -ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. 
7  వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మునుగూర్చి యెషయాప్రవచించినది సరియే. 
8  మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుష్యుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. 
9  మరియు ఆయన - మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకై దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. 
10  నీ తలిదండ్రులను ఘనపరచవలెననియు, తండ్రినైనను తల్లినైనను దూషించువానికి మరణశిక్ష విధింపవలెననియు మోషే చెప్పెను గదా. 
11-12. అయినను మీరు - ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి- నా వలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కొర్బాను, అనగా దేవార్పితమని చెప్పినయెడల తన తండ్రికైనను తల్లికైనను వానిని ఏమియు చేయనియ్యక 
13  మీరు నియమించిన మీ పారంపర్యాచారమువలన దేవుని వాక్యమును నిరర్థకము చేయుదురు. ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పెను. 
14  అప్పుడాయన జనసమూహమును మరల తనయొద్దకు పిలిచి -మీరందరు నా మాట విని గ్రహించుడి. 
15  మనుష్యుని వెలుపటనుండి లోపలికి పోయి వానిని అపవిత్రునిగా చేయగలుగునది ఏదియు లేదుగాని లోపటనుండి బయలు వెళ్లునవే మనుష్యుని అపవిత్రునిగా చేయుననెను. 
16  *మనుష్యుని వెలుపటనుండి లోపలికి పోయి వానిని అపవిత్రునిగా చేయగలుగునది ఏదియు లేదుగాని లోపటనుండి బయలు వెళ్లునవే మనుష్యుని అపవిత్రునిగా చేయుననెను. 
17  ఆయన జనసమూహమును విడిచి యింటిలోకి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమునుగూర్చి ఆయన నడుగగా 
18  ఆయన వారితో ఇట్లనెను - మీరు ఇంత అవివేకులైయున్నారా? వెలుపటనుండి మనుష్యుని లోపలికి పోవునదేదియు వాని నపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా?  
19  అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడువబడును; ఇట్లు అది భోజనపదార్థములన్నిటిని పవిత్రపరచును. 
20  మనుష్యుని లోపటనుండి బయలు వెళ్లునది మనుష్యుని అపవిత్రపరచును. 
21  లోపటనుండి, అనగా మనుష్యుల హృదయములోనుండి దురాలోచనలును జారత్వములును దొంగతనములును 
22  నరహత్యలును వ్యభిచారములును లోభములును చెడుతనములును కృత్రిమమును కామవికారమును మత్సరమునుదేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును. 
23  ఈ చెడ్డవన్నియ లోపటనుండియే బయలు వెళ్లి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. 
24  ఆయన అక్కడనుండి లేచి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్లి యొక ఇంట ప్రవేశించి, ఆ సంగతి ఎవనికిని తెలియకుండవలెనని కోరెను గాని ఆయన మరుగై యుండలేక పోయెను. 
25  అపవిత్రాత్మ పట్టిన చిన్నకుమార్తెగల యొక స్త్రీ ఆయననుగూర్చి విని, వచ్చి ఆయన పాదములమీద పడెను. 
26  ఆ స్త్రీ సురోఫెనికయ వంశమందు పుట్టిన హెల్లేనీయురాలు. ఆమె తన కుమార్తెలోనుండి ఆ దయ్యమును వెళ్లగొట్టుమని ఆయనను వేడుకొనెను. 
27  ఆయన ఆమెను చూచి - పిల్లలు మొదట తృప్తిపొందవలెను; పిల్లల భోజనము తీసికొని కుక్కపిల్లలకు వేయుట యుక్తము కాదనెను. 
28  అందుకామె - నిజమే ప్రభువా, అయితే కుక్కపిల్లలు సహితము బల్లక్రింద ఉండి పిల్లలు పడవేయు రొట్టెముక్కలు తినును గదా అని ఆయనతో చెప్పెను. 
29  అందుకాయన - ఈ మాట చెప్పినందున వెళ్లుము; దయ్యము నీ కుమార్తెను వదలిపోయినదని ఆమెతో చెప్పెను. 
30  ఆమె యింటికి వచ్చి తన కుమార్తె మంచముమీద పండుకొని యుండుటయు దయ్యము వదలిపోయి యుండుటయు చూచెను. 
31  ఆయన మరల తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపొలి ప్రాంతములమీదుగా గలిలైయ సముద్రమునొద్దకు వచ్చెను. 
32  అప్పుడు వారు చెవుడు గల నత్తివాని ఒకని ఆయనయొద్దకు తోడుకొనివచ్చి వానిమీద చెయ్యియుంచుమని ఆయనను వేడుకొనిరి. 
33  ఆయన సమూహములోనుండి వానిని ఏకాంతమునకు తోడుకొనిపోయి, వాని చెవులలో తన వేళ్లుపెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి 
34  ఆకాశమువైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి - ఎప్ఫతా అని వానితో చెప్పెను; ఆ మాటకు తెరవబడుమని అర్థము. 
35  అంతట వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలెను గనుక వాడు తేటగా మాటలాడెను. 
36  అప్పుడాయన - ఇది ఎవనితోను చెప్పవద్దని వారికాజ్ఞాపించెను; అయితే ఆయన చెప్పవద్దని వారికాజ్ఞాపించిన కొలదీ వారు మరి ఎక్కువగా దాని ప్రసిద్ధిచేయుచు 
37  ఈయన సమస్తమును బాగుగా చేసియున్నాడు; చెవిటివారు వినునట్లుగాను మూగవారు మాటలాడునట్లు గాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. 
Download Audio File