Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Wednesday, August 14, 2013

మార్కు14వఅధ్యాయము

1  రెండు దినములైన పిమ్మట పస్కా పండుగ, అనగా పులియని రొట్టెలపండుగ వచ్చెను. అప్పుడు ప్రధాన యాజకులును శాస్త్రులును మాయోపాయముచేత ఆయననేలాగు పట్టుకొని చంపుదుమని ఆలోచించుకొనుచుండిరి గాని 
2  ప్రజలలో అల్లరి కలుగునేమో అని పండుగలో వద్దని చెప్పుకొనిరి. 
3  ఆయన బేతనియలో కుష్ఠరోగియైన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండియున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరుగల శిలాభరణి తీసుకొని వచ్చి, ఆ శిలాభరణి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తలమీద పోసెను. 
4  అయితే కొందరు కోపపడి - ఈ అత్తరు ఈలాగు నష్టపరచనేల? 
5  ఈ అత్తరు మున్నూరు దేనారములకంటె ఎక్కువ వెలకమ్మి బీదలకియ్యవచ్చునని చెప్పి ఆ మెనుగూర్చి సణుగుకొనిరి. 
6  అందుకు యేసు ఇట్లనెను - ఈమె జోలికి పోకుడి; ఈమెను ఎందుకు తొందరపెట్టుచున్నారు? ఈమె నా యెడల మంచికార్యము చేసెను. 
7  బీదలు ఎల్లప్పుడును మీతోనే యున్నారు, మీ కిష్టమైనప్పుడెల్ల వారికి మేలు చేయవచ్చును; నేను ఎల్లప్పుడును మీతో నుండను. 
8  ఈమె తన శక్తికొలది చేసి, నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. 
9  సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. 
10  పన్నెండుమందిలో ఇస్కరియోతు యూదా అను ఒకడు ప్రధానయాజకులచేతికి ఆయనను అప్పగింపవలెనని వారియొద్దకు పొగా 
11  వారు విని సంతోషించి వానికి ద్రవ్యమిత్తుమని వాగ్దానము చేసిరి గనుక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. 
12  పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించునప్పుడు ఆయన శిష్యులు - నీవు పస్కాను భుజించుటకు మేమెక్కడికి వెళ్లి సిద్ధపరచ గోరుచున్నావని ఆయన నడుగగా 
13  ఆయన - మీరు పట్టణములోకి వెళ్లుడి; అక్కడ నీళ్లకుండ మోయుచున్న యొక మనుష్యుడు మీకెదురుపడును; 
14  వాని వెంటబోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ యింటి యజమానుని చూచి - నేను నా శిష్యులతో కూడ పస్కాను భుజించుటకు విడిది గది యెక్కడని బోధకుడడుగుచున్నాడని చెప్పుడి. 
15  అతడు సామగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ మనకొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులలో ఇద్దరిని పంపెను. 
16  శిష్యులు వెళ్లి పట్టణములోకి వచ్చి ఆయన వారితో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచిరి. 
17  సాయంకాలమైనప్పుడు ఆయన తన పన్నెండుమంది శిష్యులతో కూడ వచ్చెను. 
18  వారు కూర్చుండి భోజనము చేయుచుండగా యేసు - మీలో ఒకడు, అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పగా 
19  వారు దుఃఖపడి - నేనే అని యొకని తరువాత ఒకడు ఆయననడుగసాగిరి. 
20  అందుకాయన - పన్నెండుమందిలో ఒకడే, అనగా నాతోకూడ పాత్రలో (చెయ్యి) ముంచువాడే. 
21  నిజముగా మనుష్యకుమారుడు ఆయననుగూర్చి వ్రాయబడినట్టు పోవుచున్నాడు; అయితే ఎవనిచేత మనుష్యకుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ; ఆ మనుష్యుడు పుట్టకుండిన వానికి మేలనెను. 
22  వారు భోజనము చేయుచుండగా ఆయన యొక రొట్టెను ఎత్తుకొని, ఆశీర్వదించి విరిచి వారికిచ్చి - మీరు తీసికొనుడి; ఇది నా శరీరమనెను. 
23  పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని వారికిచ్చెను; వారందరు దానిలోనిది త్రాగిరి. 
24  అప్పుడాయన - ఇది నిబంధనవిషయమైఅనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము. 
25  నేను దేవుని రాజ్యములో ద్రాక్షరసము క్రొత్తదిగా త్రాగు దినమువరకు ఇకను దాని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.  
26  అంతట వారు కీర్తన పాడి ఒలీవలకొండకు వెళ్లిరి. 
27  అప్పుడు యేసు వారిని చూచి - మీరందరు అభ్యంతరపడెదరు;గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదరిపోవునుఅని వ్రాయబడియున్నది గదా. 2
28  అయితే నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలైయలోకి వెళ్లెదననెను. 
29  అందుకు పేతురు - అందరు అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా 
30  యేసు అతని చూచి - నేటి రాత్రి కోడి రెండుమారులు కూయకమునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. 
31  అతడు మరి ఖండితముగా - నేను నీతోకూడ చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనే చెప్పననెను. అట్లు వారందరుననిరి. 
32  వారు గెత్సమనే అనబడిన చోటుకు వచ్చినప్పుడు ఆయన - నేను ప్రార్థనచేసి వచ్చువరకు మీరిక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి 
33  పేతురును యాకోబును యోహానును వెంటబెట్టుకొనిపోయి, మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించెను. 
34  అప్పుడాయన - నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగియున్నది; మీరిక్కడ ఉండి మెళకువగా నుండుడని వారితో చెప్పి 
35  కొంతదూరము సాగిపోయి నేలమీద పడి సాధ్యమైతే ఆ గడియ తనయొద్దనుండి తొలగిపోవలెనని ప్రార్థించుచు 
36  - నాయనా తండ్రీ, నీకు సమస్తము సాధ్యము; ఈ గిన్నె నా యొద్దనుండి తీసివేయుము; అయినను నా యిష్టప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్ము అనెను. 
37  మరల ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూచి - సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడియయైనను మేలుకొనియుండలేవా? 
38  మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెళుకువగానుండి ప్రార్థన చేయుడి; ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి 
39  తిరిగి పోయి, యింతకుముందు పలికిన మాటలనే పలుకుచు ప్రార్థించెను. 
40  ఆయన తిరిగివచ్చి చూడగా వారు నిద్రించుచుండిరి; ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను, ఆయనకేమి ఉత్తరమియ్యవలెనో వారికి తోచలేదు. 
41  ఆయన మూడవ సారి వచ్చి - మీరికను నిద్రపోయి అలసట తీర్చుకొనుడి. ఇక చాలును, గడియ వచ్చినది; ఇదిగో మనుష్యకుమారుడు పాపులచేతికి అప్పగింపబడుచున్నాడు; 
42  లెండి పోదము; ఇదిగో నన్ను అప్పగించువాడు వచ్చియున్నాడని చెప్పెను. 
43  వెంటనే, ఆయన ఇంక మాటలాడుచుండగా పన్నెండుమంది శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదా వచ్చెను. వానితోకూడ బహుజనులు కత్తులు గుదియలు పట్టుకొని, ప్రధానయాజకుల యొద్దనుంచియు శాస్త్రులయొద్దనుంచియు పెద్దలయొద్దనుంచియు వచ్చిరి. 
44  ఆయనను అప్పగించువాడు - నేనెవని ముద్దుపెట్టుకొందునో ఆయనే (యేసు); ఆయనను పట్టుకొని భద్రముగా కొనిపోవుడని వారికి గురుతు చెప్పియుండెను. 
45  వాడు వచ్చి వెంటనే ఆయనయొద్దకు పోయి - బోధకుడా అని చెప్పి, ఆయనను ముద్దుపెట్టుకొనగా 
46  వారు బలాత్కారముగా ఆయనమీద పడి ఆయనను పట్టుకొనిరి. 
47  దగ్గర నిలిచియున్నవారిలో ఒకడు కత్తిదూసి ప్రధానయాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగనరికెను. 
48  అందుకు యేసు - మీరు బందిపొటు దొంగమీదికి వచ్చినట్టు కత్తులతోను గుదియలతోను నన్ను పట్టుకొన వచ్చితిరా? 
49  నేను ప్రతి దినము దేవాలయములో మీయొద్ద ఉండి బోధించుచుండగా మీరు నన్ను పట్టుకొనలేదు; అయితే లేఖనములు నెరవేరునట్లు (ఈలాగు జరుగుచున్నదని చెప్పెను) 
50  అప్పడు వారందరు ఆయనను విడిచి పారిపోయిరి. 
51  తన దిగంబర శరీరముమీద నారబట్ట వేసికొనియున్న యొక పడుచువాడు ఆయన వెంట వెళ్లుచుండగా వారతని పట్టుకొనిరి. 
52  అతడు నారబట్ట విడిచి దిగంబరుడై పారిపోయెను. 
53  వారు యేసును ప్రధానయాజకునియొద్దకు తీసికొనిపోయిరి. ప్రధానయాజకులు పెద్దలు శాస్త్రులు అందరును అతనితోకూడవచ్చిరి. 
54  పేతురు ప్రధానయాజకుని యింటిముంగిటివరకు దూరమునుండి ఆయనవెంటపోయి బంట్రౌతులతోకూడ కూర్చుండి, మంటయొద్ద చలికాచుకొనుచుండెను. 
55  ప్రధానయాజకులును మహాసభవారందరును యేసును చంపింపవలెనని ఆయన మీద సాక్ష్యము వెదికిరిగాని యేమియు వారికి దొరకలేదు. 
56  అనేకులు ఆయనమీద అబద్ధసాక్ష్యము పలికినను వారి సాక్ష్యములు ఒకదాని ఒకటి సరిపడలేదు. 
57-59. అప్పుడు కొందరు లేచి - చేతిపనియైన ఈ దేవాలయమును పడగొట్టి మూడు దినములలో చేతిపనికాక మరియొక దేవాలయమును నేను కట్టుదునని ఇతడు చెప్పుచుండగా వింటిమని ఆయనమీద అబద్ధసాక్ష్యము చెప్పిరి గాని ఆలాగైనను వీరి సాక్ష్యమును సరిపడలేదు. 
60  ప్రధానయాజకుడు వారిమధ్యను లేచి నిలిచి - ఉత్తరమేమియు చెప్పవా? వీరు నీమీద పలుకుచున్న ఉత్తరమేమని యేసు నడిగెను. 
61  అయితే ఆయన ఉత్తరమేమియు చెప్పక ఊరకుండెను. తిరిగి ప్రధానయాజకుడు - శ్రీ భగవంతుని కుమారుడవైన క్రీస్తువు నీవేనా అని ఆయననడుగగా 
62  యేసు - అవును నేనే; మీరు మనుష్యకుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు చూచెదరని చెప్పెను. 
63  ప్రధానయాజకుడు తన వస్త్రములు చింపుకొని - మనకు ఇక సాక్షులతో పని ఏమి? 
64  ఈ దేవదూషణ మీరు విన్నారు కారా; మీకేమి తోచుచున్నదని అడుగగా వారందరు - మరణమునకు పాత్రుడని ఆయనకు నేరస్థాపన చేసిరి. 
65  కొందరు ఆయనమీద ఉమ్మివేసి ఆయన ముఖమునకు ముసుకువేసి ఆయనను గుద్దుచు - ప్రవచింపుమని ఆయనతో చెప్పసాగిరి. బంట్రౌతులును ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకొనిరి. 
66  పేతురు ముంగిట క్రిందిభాగములో ఉండగా ప్రధానయాజకుని పనికత్తెలలో ఒకతెవచ్చి 
67  పేతురు చలికాచుకొనుచుండుట చూచెను; అతని నిదానించి చూచి - నీవును నజరేయుడవగు ఆ యేసుతోకూడ ఉండినవాడవు కావా అనెను. 
68  అందుకతడు - ఆయన ఎవడో నేనెరుగను; నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి నడవలోకి వెళ్లెను; అంతట కోడి కూసెను. 
69  ఆ పనికత్తె అతని చూచి - వీడు వారిలో ఒకడని దగ్గర నిలిచియున్నవారితో మరల చెప్పసాగెను. 
70  కొంతసేపైన తరువాత దగ్గర నిలిచియున్నవారు మరల పేతురును చూచి- నిజముగా నీవు వారిలో ఒకడవు; నీవు గలిలైయుడవు గదా అనిరి. 
71  అందుకతడు - మీరు చెప్పుచున్న మనుష్యుని నేనెరుగనని చెప్పి, శపించుకొనుటకును ఒట్టుపెట్టుకొనుటకును మొదలు పెట్టెను. 
72  వెంటనే రెండవమారు కోడి కూసెను గనుక - కోడి రెండు మారులు కూయకమునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని తలపోయుచు ఏడ్చెను. 
 Download Audio File

No comments:

Post a Comment