Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Friday, August 16, 2013

మార్కు3వఅధ్యాయము

1  సమాజమందిరములో ఆయన మరల ప్రవేశింపగా అక్కడ ఊచచెయ్యి గలవాడు ఒకడుండెను. 
2  అచ్చటి వారు ఆయనమీద నేరము మోపవలెననియుండి, విశ్రాంతిదినమున వాని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. 
3  ఆయన - నీవు లేచి మధ్యను నిలువమని ఊచచెయ్యిగలవానితో చెప్పి 
4  వారిని చూచి - విశ్రాంతిదినమున మేలుచేయుట ధర్మమా కీడుచేయుట ధర్మమా? ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా? అని అడిగెను; అందుకు వారు ఊరకుండిరి. 
5  ఆయన వారిహృదయకాఠిన్యమునకు దుఃఖపడి, కోపముతో వారిని కలయచూచి - నీ చెయ్యి చాపుమని ఆ మనుష్యునితో చెప్పెను; వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. 
6  పరిసయ్యులు వెలుపలికిపోయి వెంటనే హేరోదీయులతో కలిసికొని, ఆయననేలాగు సంహరింతుమాయని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. 
7  యేసు తన శిష్యులతోకూడ సముద్రమునొద్దకు వెళ్లగా గలిలైయనుండి వచ్చిన గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను. 
8  మరియు ఆయన ఇంత గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదైనుండియు, యెరూషలేమునుండియు, ఇదూమైయనుండియు, యొర్దాను అవతలనుండియు తూరు సీదోను అనెడి పట్టణప్రాంతములనుండియు ఆయనయొద్దకు గుంపులు గుంపులుగా వచ్చిరి. 
9  జనులు గుంపుకూడగా చూచి, వారు తన్ను ఇరికింపకుండునట్లు చిన్నదోనె యొకటి తనకు సిద్ధపరచి యుంచవలెనని ఆయన తన శిష్యులతో చెప్పెను. 
10  ఆయన అనేకులను స్వస్థపరచెను గనుక రోగపీడితులైనవారందరు ఆయనను ముట్టుకొనవలెనని ఆయనమీద పడుచుండిరి. 
11  అపవిత్రాత్మలు (పట్టినవారు) ఆయనను చూడగానే ఆయన యెదుట సాగిలపడి - నీవు దేవుని కుమారుడవని చెప్పుచు కేకలు వేసిరి. 
12  ఆయన తన్ను ప్రసిద్ధిచేయవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. 
13  తరువాత ఆయన కొండెక్కి తనకిష్టమైనవారిని పిలువగా వారాయనయొద్దకు వచ్చిరి. 
14-15. వారు తనతోకూడ ఉండి, దయ్యములను వెళ్లగొట్టు అధికారముగలవారై (సువార్త) ప్రకటించుటకు వారిని పంపవలెనని ఆయన పన్నెండుమందిని నియమించెను. 
16  వారెవరనగా - ఆయన పేతురను పేరుపెట్టిన సీమోను 
17  జెబెదై కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను; వీరిద్దరికి ఆయన బోయనేర్గెసను పేర్లు పెట్టెను; బోయనేర్గెసు అనగా ఉరిమెడువారని అర్థము. 
18  అంద్రెయ, ఫిలిప్పు, బర్తొలొమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడగు యాకొబు, తద్దయి కనానీయుడైన సీమోను, 
19  ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా అనువారు. 
20  ఆయన ఇంటిలోకి వచ్చినప్పుడు జనులు మరల గుంపుకూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను వారికి వీలులేకపోయెను. 
21  ఆయన ఇంటివారు సంగతి విని, ఆయన మతి చలించియున్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. 
22  యెరూషలేమునుండి వచ్చిన శాస్త్రులు - ఇతడు బయల్జెబూలు పట్టినవాడై దయ్యముల యధిపతిచేత దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని చెప్పిరి. 
23  అప్పుడాయన వారిని తనయొద్దకు పిలిచి ఉపమానరీతిగా వారితో ఇట్లనెను - సాతాను సాతానునేలాగు వెళ్లగొట్టును? 
24  ఒక రాజ్యము తనకుతానే విరోధముగా వేరుపడినయెడల ఆ రాజ్యము నిలువనేరదు. 
25  ఒక యిల్లు తనకుతానే విరోధముగా వేరుపడినయెడల ఆ యిల్లు నిలువనేరదు. 
26  సాతాను తనకుతానే విరోధముగా లేచి వేరుపడినయెడల వాడు నిలువలేక కడతీరును. 
27  ఒకడు మొదట బలవంతుడైన వాని బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంటజొచ్చి వాని సామగ్రి దోచుకొననేరడు; బంధించినయెడల వాని యిల్లు దోచుకొనవచ్చును. 
28  సమస్త పాపములును మనుష్యులు చేయు దూషణలన్నియు వారికి క్షమింపబడును గాని 
29  పరిశుద్ధాత్మ విషయము దూషణచేయువాడెప్పుడును క్షమాపణ పొందక నిత్యపాపము చేసినవాడైయుండుని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాననెను. 
30  ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టినవాడని వారు చెప్పిరి. 
31  తరువాత ఆయన సహోదరులను తల్లియు వచ్చి లోపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయనచుట్టు కూర్చుండిరి. 
32  వారు - ఇదిగో నీ తల్లియు నీ సహోదరులును వెలుపల ఉండి నీకోసరము వెదకుచున్నారని ఆయనతో చెప్పగా 
33  ఆయన - నా తల్లి నా సహోదరులు ఎవరని చెప్పి 
34  తన చుట్టు కూర్చున్నవారిని కలయ చూచి- ఇదిగో నా తల్లియు నా సహోదరులును; 
35  దేవుని చిత్తముచొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియునై యున్నాడని చెప్పెను. 
Download Audio File

No comments:

Post a Comment