Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Friday, August 16, 2013

మార్కు2వఅధ్యాయము

1  కొన్నిదినములైన పిమ్మట ఆయన మరల కపెర్నహూములోకి వచ్చెను. 
2  ఆయన యింట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడివచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా 
3  కొందరు పక్షవాయువుగల ఒక మనుష్యుని నలుగురిచేత మోయించుకొని ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి. 
4  చాలమంది కూడియున్నందున వారాయనయొద్దకు చేరలేక ఆయనయున్నచోటికి పైగా ఇంటికప్పు విప్పి, సందుచేసి పక్షవాయువుగలవానిని పరుపుతోనే దింపిరి. 
5  యేసు వారి విశ్వాసము చూచి - కుమారుడా, నీ పాపములు క్షమింపబడియున్నవని పక్షవాయువుగలవానితో చెప్పెను. 
6  శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండియుండిరి. 
7  వారు - ఇతడిట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణచేయుచున్నాడు గదా; దేవుడొక్కడే తప్ప పాపములు క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. 
8  వారు తమలోతాము ఈలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలిసికొని - మీరీలాటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు?  
9  ఈ పక్షవాయువుగలవానితో - నీ పాపములు క్షమింపబడియున్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరపెత్తుకొని నడువుమని చెప్పుట సులభమా?  
10  అయితే పాపములు క్షమించుటకు భూమిమీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెనని వారితో చెప్పి 
11  పక్షవాయువుగలవానిని చూచి - నీవు లేచి నీ పరుపెత్తుకొని యింటికి పొమ్మని నీతో చెప్పుచున్నాననెను. 
12  తత్క్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరియెదుట నడిచిపోయెను గనుక వారందరు విభ్రాంతినొంది - మనమీలాటికార్యములను ఎన్నడును చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి. 
13  ఆయన సముద్రతీరమున మరల నడచిపోవుచుండెను. జనులందరును ఆయనయొద్దకు రాగా ఆయన వారికి బోధించెను. 
14  ఆయన మార్గమున వెళ్లుచు, సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫయు కుమారుడగు లేవిని చూచి - నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. 
15  అతనియింట ఆయన భోజనమునకు కూర్చుండియుండగా, సుంకరులను పాపులును అనేకులు యేసుతోను ఆయన శిష్యులతోను కూర్చుండియుండిరి. ఇట్టివారనేకులుండిరి. వారాయనను వెంబడించువారైరి. 
16  పరిసయ్యులలోనున్న శాస్త్రులు ఆయన సుంకరులతోను పాపులతోను భుజించుట చూచి - ఆయన సుంకరులతోను పాపులతోను కలిసి భోజనము చేయుచున్నాడేమని ఆయన శిష్యుల నడుగగా 
17  యేసు ఆమాట విని - రోగులకేగాని ఆరోగ్యముగలవారికి వైద్యుడక్కరలేదు; నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను. 
18  యోహోను శిష్యులును పరిసయ్యులును ఉపవాసము చేయుట కద్దు. కాబట్టి వారు వచ్చి - యోహాను శిష్యులును పరిశయ్యుల శిష్యులును ఉపవాసము చేయుదురు; దీనికి హేతువేమని ఆయన నడుగగా 
19  యేసు -పెండ్లికుమారుడు తమతోకూడ ఉన్నకాలమున పెండ్లి ఇంటివారు ఉపవాసము చేయదగునా? పెండ్లికుమారుడు తమతోకూడ ఉన్నంతకాలము ఉపవాసము చేయదగదు గాని 
20  పెండ్లికుమారుడు వారియొద్దనుండి కొనిపోబడు దినములు వచ్చును. ఆ దినములలోనే వారుపవాసము చేతురు.  
21  ఎవడును పాతబట్టకు కొత్తగుడ్డ మాసికను వేయడు; వేసినయెడల ఆ కొత్త మాసిక పాత బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును.  
22  ఎవడును పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసము పోయడు; పోసినయెడల ద్రాక్షారసము ఆ తిత్తులను పిగుల్చును, రసమును తిత్తులును చెడును; అయితే కొత్త ద్రాక్షరసము కొత్త తిత్తులలో పోయవలెనని చెప్పెను. 
23  మరియు ఆయన విశ్రాంతిదినమున పంటచేలలోబడి వెళ్లుచుండగా శిష్యులు మార్గమున సాగిపోవుచు వెన్నులు త్రుంచుచుండిరి. 
24  పరిశయ్యులు - చూడుము, విశ్రాంతిదినమున చేయకూడనిది వారేల చేయుచున్నారని ఆయన నడిగిరి. 
25  అందుకాయన వారితో ఇట్లనెను - తానును తనతోకూడ నున్నవారును ఆకలిగొనినందున దావీదుకు అవసరము వచ్చియున్నప్పుడు అతడు చేసినది మీరెన్నడును చదవలేదా? 
26  అబ్యాతారు ప్రధానయాజకుడై యుండగా దేవమందిరములోకి వెళ్లి, యాజకులే గాని యితరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడ ఉన్నవారికిచ్చెను గదా అని చెప్పెను. 
27  మరియు - విశ్రాంతిదినము మనుష్యులకొరకే నియమింపబడెను గాని మనుష్యులు విశ్రాంతిదనముకొరకు నియమింపబడలేదు.  
28  అందువలన మనుష్యకుమారుడు విశ్రాంతిదినమునకు ప్రభువై యున్నాడని వారితో చెప్పెను. 
Download Audio File

No comments:

Post a Comment