Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Friday, August 16, 2013

మార్కు1వఅధ్యాయము

1  దేవుని కుమారుడైన యేసుక్రీస్తు1సువార్త ప్రారంభము. 
2  - ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను; అతడు నీ మార్గము సిద్ధపరచును. 
3  ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయుచున్న ఒకని శబ్దము. అని ప్రవక్తయైన యెషయాచేత వ్రాయబడినట్టు2. 
4  బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాపక్షమాపణనిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచు వచ్చెను. 
5  అంతట యూదైయ దేశస్థులందరును యెరూషలేమువారందరును బయలుదేరి అతనియొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు, యొర్దాను నదిలో అతనిచేత బాప్తిస్మము పొందుచుండిరి. 
6  యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొలచుట్టు తోలుదట్టియు ధరించుకొని. మిడతలను అడవి తేనెను భక్షించువాడు. 
7  మరియు అతడు నాకంటె శక్తిమంతుడొకడు నా వెనుక వచ్చుచున్నాడు; నేను వంగి ఆయన చెప్పులవారును విప్ప పాత్రుడను కాను; 
8  నేను నీళ్లలో3మీకు బాప్తిస్మమిచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మలో4మీకు బాప్తిస్మమిచ్చునని చెప్పి ప్రకటించుచుండెను. 
9  ఆ దినములలో యేసు గలిలైయలోని నజరేతు నుండి వచ్చి యొర్దానులో యోహానుచేత బాప్తిస్మము పొందెను. 
10  వెంటనే ఆయన నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము తెరువబడుటయు పరిశుద్ధాత్మ పావురమువలె తనమీదికి దిగివచ్చుటయు చూచెను. 
11  మరియు -- నీవు నా ప్రియకువారుడవు; నీయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను. 
12  వెంటనే పరశుద్ధాత్మ ఆయనను అరణ్యములోకి వెళ్లునట్లు ప్రేరేపించెను. 
13  ఆయన సాతానుచేత శోధింపబడుచు అరణ్యములో నలుబది దినములు అడవి మృగములతోకూడ నుండెను; మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. 
14  యోహాను చెరసాలలో వేయబడిన తరువాత యేసు 
15  --- కాలము సంపూర్ణమై యున్నది, దేవుని రాజ్యము సమీపించి యున్నది; మారుమనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలైయకు వచ్చెను.  
16  ఆయన గలిలైయ సముద్రతీరమున వెళ్లుచుండగా సీమోనును సీమోను సహోదరుడగు అంద్రెయయు సముద్రములో వలవేయుట చూచెను; ఏలయనగా వారు జాలరులు. 
17  యేసు -- నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టుజాలరులనుగా చేసెదనని వారితో చెప్పెను.  
18  వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. 
19  ఆయన ఇంక కొంతదూరము వెళ్లి జెబెదై కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను; వారు దోనెలో ఉండి తమ వలలు బాగుచేసికొనుచుండిరి. 
20  వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రియైన జెబెదైని జీతగాండ్రయొద్ద దోనెలో విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. 
21  అంతట వారు కపెర్నహూములోకి వెళ్లిరి. వెంటనే ఆయన విశ్రాంతిదినమున సమాజమందిరములోకి పోయి బోధించెను. 
22  ఆయన శాస్త్రులవలె కాక అధికారము గలవానివలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. 
23  ఆ సమయమున వారి సమాజమందిరములో అపవిత్రాత్మపట్టిన మనుష్యుడొకడుండెను. 
24  వాడు -- వద్దు నజరేయుడవగు యేసూ, నీతో మాకేమి? మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియును; నీవు దేవుని పరిశుద్దుడవు అని కేకలు వేసెను. 
25-26. అందుకు యేసు - ఊరకొమ్ము, వాని విడిచిపొమ్మని దాని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వాని విలవిలలాడించి పెద్ద కేకవేసి వాని విడిచిపోయెను. 
27  అందరును విస్మయమొంది - ఇదేమిటో? యిది కొత్త బోధగా ఉన్నదే; యీయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని యొకనితో ఒకడు చెప్పుకొనిరి. 
28  వెంటనే ఆయననుగూర్చిన సమాచారము త్వరలో గలిలైయ ప్రాంతములందంతట వ్యాపించెను. 
29  అటుతరువాత వారు సమాజమందిరములోనుండి వెళ్లి యాకోబుతోను యోహానుతోను సీమోను అంద్రెయ అనువారి యింట ప్రవేశించిరి. 
30  సీమోను అత్త జ్వరముతో పడియుండగా వెంటనే వారామెను గూర్చి ఆయనతో చెప్పిరి. 
31  ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యిపట్టి ఆమెను లేవలెత్తెను; అంతట జ్వరము ఆమెను వదిలెను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను. 
32  సాయంకాలమున ప్రొద్దు గ్రుంకినప్పుడు జనులు సకల రోగులను దయ్యములు పట్టినవారిని ఆయన యొద్దకు తీసికొని వచ్చిరి; 
33  పట్టణమంతయు ఇంటి వాకిట కూడియుండెను. 
34  ఆయన నానావిధ రోగములచేత పీడింపబడిన అనేకులను స్వస్థపరచి అనేకమైన దయ్యములన వెళ్లగొట్టెను. అవి తన్ను ఎరిగియుండినందున ఆయన ఆ దయ్యములను మాటలాడనియ్యలేదు. 
35  ఇంక చాలరాత్రియుండగా ఆయన పెందలకడనే లేచి బయలుదేరి అరణ్యప్రదేశమునకు వెళ్లి అక్కడ ప్రార్థనచేయుచుండెను. 
36  సీమోనును అతనితో కూడ నున్నవారును ఆయనకోసరము వెళ్లి 
37  ఆయనను కనుగొని - అందరు నిన్ను వెదకుచున్నారని ఆయనతో చెప్పగా 
38  ఆయన - నేను ఇతరమైన సమీపగ్రామములలోను ప్రకటించుటకు వెళ్లుదము రండి; యిందు నిమిత్తమే గదా నేను బయలుదేరి వచ్చితినని వారితో చెప్పెను. 
39  ఆయన గలిలైయయందంతట వారి సమాజమందిరములలో ప్రకటించుచు దయ్యములను వెళ్లగొట్టుచునుండెను. 
40  ఒక కుష్ఠరోగి ఆయనయొద్దకు వచ్చి ఆయనయెదుట మోకాళ్లూని - నీ కిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా. 
41  ఆయన కనికరపడి చెయ్యి చాపి వాని ముట్టి - నాకిష్టమే; నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. 
42  వెంటనే కుష్ఠరోగము వాని విడిచెను గనుక వాడు శుద్ధుడాయెను. 
43  అప్పుడాయన - ఎవనితోను ఏమియు చెప్పకుసుమీ; 
44  నీవు వెళ్లి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనుపరచుకొని, నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించుమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వాని పంపివేసెను. 
45  అయితే వాడు వెళ్లి అందునుగూర్చి విస్తారముగా ప్రకటించుటకును, ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను గనుక ఆయన ఇకను పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక వెలపట అరణ్యప్రదేశములలో నుండెను; నలుదిక్కులనుండి జనులు ఆయనయొద్దకు వచ్చుచుండిరి. 
Download Audio File

No comments:

Post a Comment